తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి

తెలంగాణ లో చలి తీవ్రత భారీగా పెరిగింది. గత నాల్గు రోజులుగా చలి తీవ్రత మరింత పెరుగుతూ వస్తుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం పది గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు. ఈ సీజన్ లో నవంబరు నెలలోనే చలి మొదలైంది. వారం రోజుల కిందట 15 డిగ్రీలున్న ఉష్ణోగ్రత.. ఇప్పుడు 10.7 డిగ్రీలకు పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మరీ తక్కువగా ఉంది. వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉండటంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారు జామున మంచు కురుస్తుండటంతో పాటు.. చలిగాలులు ఎక్కువగా ఉంటున్నాయి.

రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్షియస్ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని అంచనా వేశారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 16.1 సెల్షియస్ వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో రాబోయే రెండు రోజుల పాటు చలిగాలులు మరింత పెరిగే అవకాశముందని, ఉష్ణోగ్రతలు రెండు లేదా మూడు డిగ్రీలు తగ్గే అవకాశముందని తెలిపింది.

నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా చలిగాలులు వీస్తున్నాయని, అవి మరికొద్దిరోజుల పాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.