ఘనంగా ముగిసిన అయోధ్య భూమి పూజ

నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకల వినియోగం

PM MODI

అయోధ్య: ప్రధాని నరేంద్రమోడి చేతుల మీదుగా అయోధ్య రామాలయ భూమి పూజ అనుకున్న ముహూర్తం ప్రకారం ఘనంగా ముగిసింది. సరిగ్గా ముహూర్త సమయానికే పండితులు ఈ క్రతువును చేయించారు. ఈ క్రతువు ముగియగానే ప్రధాని మోడి పునాది నుంచి కుంకుమ తీసుకొని నుదుట ధరించారు. దీంతో అక్కడే వున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో పాటు అతిథులు గట్టిగా కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోడి పునాది వేసిన ప్రాంతానికి శిరస్సు వంచి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో పాటు సీఎం యోగి, గవర్నర్ ఆనందీబేన్ పాటిల్, ట్రస్ట్ అధ్యక్షులు నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు.

కాగా ఈ కార్యక్రమంలో నక్షత్రాకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ఈ ఐదు వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమశాస్త్ర పండితుల భావన. భూమిపూజలో హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం, పుణ్యనదీ జలాలను వినియోగించారు. మరోవైపు భూమిపూజ జరుగుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సాధువులు హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య భూమిపూజ కన్నులపండువగా జరిగింది.

తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/