భారత్‌ పైన కూడా చైనా బెలూన్ల నిఘా: అమెరికా

chinese-spy-balloons-targeted-india-reports-us-media

వాషింగ్టన్ః చైనా త‌న వ‌ద్ద ఉన్న బెలూన్ల‌తో చాలా దేశాల‌పై నిఘా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. డ్రాగన్ దేశ బెలూన్లు ఇండియాను కూడా టార్గెట్ చేసిన‌ట్లు ఓ మీడియా క‌థ‌నం వెల్ల‌డించింది. కొన్ని రోజుల క్రితం అమెరికా గ‌గ‌న‌త‌లంలో ఎగురుతున్న చైనా బెలూన్‌ను ఆ దేశం పేల్చివేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మ మిత్ర దేశాల‌కు అగ్ర‌రాజ్యం అమెరికా కొన్ని ర‌హ‌స్య అంశాల‌ను తెలియజేసింది. ఆ మీటింగ్‌లో ఇండియాతో పాటు సుమారు 40 దేశాల‌కు చెందిన ఎంబ‌సీ అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ విదేశాంగ మంత్రి వెండీ షేర్‌మాన్ వాషింగ్ట‌న్‌లో జ‌రిగిన స‌మావేశంలో అనేక విష‌యాల‌ను వెల్ల‌డించారు.

చైనా నిఘా బెలూన్ అనేక సంవ‌త్స‌రాల పాటు హైన‌న్ ప్రావిన్సులో ఆప‌రేష‌న్‌లో ఉంది. అనేక దేశాల సైనిక స‌మాచారాన్ని ఆ బెలూన్లు సేక‌రించిన‌ట్లు అమెరికా తెలిపింది. జ‌పాన్‌, ఇండియా, వియ‌త్నాం, తైవాన్‌, పిలిప్పీన్స్‌లో ఉన్న వ్యూహాత్మ‌క కీల‌క ప్రాంతాల‌ను ఆ బెలూన్లు టార్గెట్ చేసిన‌ట్లు ద వాషింగ్ట‌న్ పోస్టు త‌న క‌థ‌నంలో చెప్పింది. ర‌క్ష‌ణ‌, ఇంటెలిజెన్స్ అధికారుల‌తో నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూల ఆధారంగా ఆ రిపోర్టును త‌యారు చేశారు.

పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీలోని వైమానిక ద‌ళం ఆ నిఘా బెలూన్ల‌ను ఆప‌రేట్ చేస్తోంద‌ని, ఇవి అయిదు ఖండాల‌పై క‌నిపించిన‌ట్లు ఆ కథ‌నంలో తెలిపారు. నిఘా వ్య‌వ‌హారాల కోసం ఇలాంటి బెలూన్ల‌ను చైనా త‌యారు చేసింద‌ని, ఇత‌ర దేశాల సార్వ‌భౌమ‌త్వాన్ని ఉల్లంఘించిన‌ట్లు ఓ సీనియ‌ర్ ర‌క్ష‌ణ అధికారి తెలిపారు. ఇటీవ‌ల స‌మ‌యంలో హ‌వాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువామ్‌ల‌పై నాలుగు బెలూన్లు క‌నిపించిన‌ట్లు ఆ క‌థనంలో వెల్ల‌డించారు.