కెసిఆర్ తెలంగాణలో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాడుః అమిత్ షా

amit-shah-public-meeting-in-kolhapur

కొల్లాపూర్ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా కొల్లాపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కొల్లాపూర్ రైతులకు హామీల వర్షం కురిపించారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వాల్మీకి, బోయ, మాదాసి, కురువ, కులాలకు న్యాయం చేస్తామన్నారు. అలాగే శ్రీశైలం నిర్వాసితులకు కెసిఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని, బిజెపి గెలిస్తే.. నిర్వాసితులకు అందరికీ పరిహారం, భూమి అందజేస్తామని కీలక హామీ ఇచ్చారు. అలాగే గుండు మల్ల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామన్నారు. దీంతో పాటుగా మామిడి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని అమిత్ షా మామిడి రైతులకు తెలిపారు.

తెలంగాణలో బిజెపి గెలిస్తే బీసీ సీఎం అవుతాడని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2.50 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చిందని.. కెసిఆర్ కు మాత్రం తన కొడుకు కెటిఆర్ ను సీఎం చేయడమే ముఖ్యమని అమిత్ షా విమర్శించారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు గెలిచి బిఆర్ఎస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ అనేక కుంభకోణాలకు పాల్పడింది. కేసీఆర్ తెలంగాణలో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాడని అమిత్ షా అన్నారు. అలాగే కొల్లాపూర్ బిజెపి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.