సమస్యలపై ప్రశ్నిస్తే మోడీ తప్పించుకుంటారుః జైపూర్ లో ఒవైసీ రోడ్ షో

ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటన

asaduddin-owaisi-take-swipe-at-pm-modi

హైదరాబాద్ః రాజస్థాన్ లోని జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన జాలుపురా, భట్టా బస్తీలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. సమస్యలపై ఎదురయ్యే ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు ప్రధాని మోడీ చిరుతను మించి వేగంగా పరుగెత్తగలరని ఎద్దేవా చేశారు. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి వచ్చిన చిరుతల నడుమ ప్రధాని మోడీ తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒవైసీ పైవిధంగా స్పందించారు.

“మీరు ఎప్పుడైనా మోడీని నిరుద్యోగం, లేక భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలపై అడిగి చూడండి… ఆయన చిరుత కంటే వేగంగా పరుగు తీస్తారు. ఆయనను మేం ఆగమని చెబుతున్నాం. అడిగే ప్రశ్నలకు నిలిచి జవాబు ఇవ్వమంటున్నాం. భారత భూభాగంపై చైనా ఎలా దురాక్రమణలకు పాల్పడుతోందో చెప్పమంటున్నాం” అని ఒవైసీ వ్యాఖ్యానించారు. హాస్యం కూడా రాజకీయాల్లో భాగమేనని ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారని, అందుకే ఆయనపై చిరుతపులి వ్యాఖ్యలు సరదాగా చేశానని తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/