వివేకా హత్య కేసు..నిందితులను చంచల్ గూడ జైల్లో ఉంచాలని సీబీఐ కోర్టు ఆదేశం

సీబీఐ కోర్టుకు హాజరైన ఐదుగురు నిందితులు

cbi-court-orders-to-shift-ys-viveka-murder-accused-from-kadapa-jail-to-hyderabad-chanchalguda-jail

హైదరాబాద్‌ః వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ విచారణను హైదరాబాద్ కు మార్చిన తర్వాత విచారణ వేగవంతమయింది. ఈరోజు ఈ కేసులోని ఐదుగురు నిందితులు సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కడప జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. మార్చి 10న ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.

కడప జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను విచారణ ఉన్న ప్రతిసారి భారీ భద్రతతో హైదరాబాద్ కు తరలించడం కష్టతరమని… వీరిని హైదరాబాద్ జైల్లో ఉంచాలని కోర్టును సీబీఐ కోరింది. ఈ విన్నపానికి అంగీకరించిన కోర్టు వారిని చంచల్ గూడ జైల్లో ఉంచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురిని చంచల్ గూడ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు ఈనాటి విచారణకు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి వ్యక్తిగతంగా హాజరయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. కడప జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సునీల్ కుమార్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను భారీ భద్రత మధ్య కడప నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు.