ఐఐటీ ఢిల్లీలో విషాదం..విద్యార్థిని ఆత్మహత్య

iit-delhi-student-found-dead-in-hostel-room

న్యూఢిల్లీః ఐఐటీ ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సంజయ్ నేర్కర్(24) తన హాస్టల్ గదిలో నిన్న ఉరివేసుకున్నాడు. తమ ఫోన్‌కాల్స్‌కు కుమారుడు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్టల్ సహచరులకు విషయం చెప్పగా వారెళ్లి చూసేసరికి సంజయ్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. హాస్టల్ సహచరులు గదికి వెళ్లేసరికి లోపలి నుంచి గడియ వేసి ఉంది. వెంటనే వారు ఆ విషయాన్ని హాస్టల్ గార్డుకు చెప్పడంతో వారొచ్చి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లిచూసి నిర్ఘాంతపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణంపై ఆరా తీస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ విద్యార్థిని కూడా తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఫైనల్ ఇయర్ చదువుతున్న 23 ఏళ్ల ఆమె హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు. బాధిత యువతి తల్లిదండ్రుల కోరిక మేరకు ఆమె వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.