చెదురుముదురు ఘటనల మధ్య ఏపీలో ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్

ఏపీలోని మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికల పోలింగ్ చెదురుముదురు ఘటనల మధ్య ముగిసాయి. నెల్లూరు నగరపాలికతో పాటు, 12 పురపాలికల్లో సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనిది కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

కాగా, అనంతపురం జిల్లా పెనుకొండ, గుంటూరు జిల్లాలో గురజాల, దాచేపల్లి, కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం, కర్నూలు జిల్లాలో బేతంచర్ల, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, కొండపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, ప్రకాశం జిల్లాలో దర్శి మున్సిపాలిటీలకు కూడా నేడు ఎన్నికలు జరిగాయి. కాగా, ఈ నెల 17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ యత్నించగా.. అక్కడే ఉన్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పార్థసారధి అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు సర్దిచెప్పి పంపించివేశారు. కుప్పం పురపాలక ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తున్న కొందరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. 18, 19 వార్డుల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తుండగా స్థానిక ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

కడపలోని కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. 9వ వార్డులో వైకాపా దొంగ ఓట్లు వేయిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. మాచిరెడ్డిపల్లి నుంచి ర్యాలీగా వెళ్లిన తెదేపా నేతలు పుత్తా లక్ష్మీరెడ్డి, చైతన్యరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.