రాష్ట్ర ప్రజలంతా ‘ఏపీ హేట్స్ జగన్’ అంటున్నారు: అచ్చెన్నాయుడు
నాలుగున్నరేళ్ల జగన్ దుర్మార్గపు పాలన.
- ప్రజల అంతరంగానికి అక్షరరూపమే ‘ఏపీ హేట్స్ జగన్ ’ పుస్తకం
- -ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

అమరావతి: స్వతంత్ర్య భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, ఏ ముఖ్యమంత్రి చేయనంత అన్యా యం.. అరాచకం.. దోపిడీని కేవలం నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేశారని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు తన ప్రభుత్వాన్ని ఛీకొట్టేలా చేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ రెడ్డికి, అతని దిక్కుమాలిన ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు చెప్పారు.శుక్రవారం టిడిపి పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ నేతలతో కలిసి ‘ ఏపీ హేట్స్ జగన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడారు.
నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు, ప్రజల అంతరంగానికి అక్షర రూపం ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకం అని అన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతులు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ‘ఏపీ హేట్స్ జగన్’ అని నినదిస్తు న్నారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా అన్ని వర్గాలవారు జగన్ రెడ్డి బాధితులే అబూ పేర్కొన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడకముందు, రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజలు భావించారని, కొత్త రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు మాత్రమే గట్టెక్కించగలరని నమ్మి, తెలుగుదేశాన్ని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. ఆనాడు తనను ప్రజలు తిరస్కరించారన్న అక్కసుతో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై విషప్రచారం చేస్తూనే ఉన్నారన్నారు.
2019 ఎన్నికల సమయంలో ప్రజల్ని హామీలతో, మోసపు వాగ్ధానాలతో నమ్మించ డంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని , ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ప్రజల్ని వేధిస్తూ, రాష్ట్రాన్నిదోపిడీ చేస్తూనే ఉన్నారన్నారు . తన దోపిడీ, అవినీతిని వాస్తవాల తో ప్రజల ముందు ఉంచుతున్నారని , వారిలో చైతన్యం వస్తే తనకు, తన ప్రభుత్వానికి సమాధి కడతారని భావించే చేయని నేరానికి చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారన్నారు జైల్లో ఉన్నా కూడా చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై, టీడీపీపై నింద లేస్తూ ప్రజల్ని ఇంకా మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్యజమెత్తారు.
బిడ్డ అంటే నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచేవారా ? జగన్ రెడ్డి?
నేను మీ బిడ్డను అంటూ ఈ మధ్య జగన్ కొత్త రాగం ఎత్తుకున్నాడు. బిడ్డ అంటే తల్లిదండ్రుల్ని, ఇతర కుటుంబసభ్యుల్ని, తనను నమ్మిన వారిని బాగా చూసుకోవాలని . కానీ జగన్ ఇప్పటివరకు చేసింది.. చేస్తున్నది అంతా అందుకు పూర్తి విరుద్ధం అన్నారు. బిడ్డ అంటే నమ్మిన వారిని నట్టేట ముంచేవాడా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నామన్నారు. బిడ్డ అంటే రాష్ట్రానికి తీరని అన్యాయం.. ప్రజలకు తీవ్ర ద్రోహం చేయడమేనా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ తో సమానమని చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని నెరవేర్చకుండానే అన్నీ చేసేశానని ప్రజల్ని ఏమార్చేప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగన్ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు చాంతాడంత ఉంటే, వాటిలో అమలు చేసినవి చారెడంతే అని పేర్కొన్నారు.
2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్.. మద్యపాన నిషేధం.. సీపీఎస్ రద్దు… ప్రత్యేకహోదా.. 25లక్షల ఇళ్లనిర్మాణం..పోలవరం నిర్మాణం… అమరావతి ఆకాంక్షలు.. ఏమయ్యాయో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, కే.ఎస్.జవహర్, గద్దె రామ్మోహన్ రావు, పంచుమర్తి అనురాధ, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/