ఏపీలో ప్రభుత్వ పాఠశాలలోని టెన్త్ టాపర్లకు నగదు ప్రోత్సాహకాలు

సీఎం జగన్ ఆదేశాలతో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ap-government-to-give-money-reward-to-ssc-toppers

అమరావతిః ఏపిలో ఇటీవల వెలువడిన పది ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన వారితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నగదు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపింది. నియోజకవర్గంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున బహుకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు సీఎం జగన్ ఆదేశాలతో ఈ నెల 23న ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించనున్నట్లు వివరించారు.

నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురికి పతకం, మెరిట్ సర్టిఫికెట్ తో పాటు జ్ఞాపికను అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కూడా సత్కరిస్తామన్నారు. గవర్నమెంట్ స్కూళ్లల్లో చదివే పిల్లలను ప్రోత్సహించే దిశగా.. సీఎం జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ నెల 27న జిల్లా స్థాయి టాపర్లకు సన్మానం జరుగుతుందని, ఫస్ట్ ర్యాంకర్ కు రూ.50 వేలు, సెకండ్ ర్యాంకర్ కు రూ.30 వేలు, థర్డ్ ర్యాంకర్ కు రూ.10 వేల చొప్పున నగదు పురస్కారం అందజేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 31న జరిగే కార్యక్రమంలో స్టేట్ టాపర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్కరిస్తారు. ఫస్ట్ ర్యాంకర్‌కు రూ.1 లక్ష, సెకండ్ ర్యాంకర్ కు రూ.75 వేలు, థర్డ్ ర్యాంకర్ కు రూ.50 వేల నగదు పురస్కారం అందజేస్తారు.