కర్ణాటక కొత్త సిఎంగా సిద్ధరామయ్య..డీకే డిప్యూటీ సిఎం: కాంగ్రెస్‌ అధికారిక ప్రకటన

Congress declares Siddaramaiah as next Karnataka CM, DK Shivakumar his solo deputy

న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం ఎవరనే విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్‌ ఖారారు చేసింది. సిద్ధరామయ్యను సీఎంగా పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ పేరును ప్రకటించారు. డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడిగానూ శివకుమార్‌ కొనసాగుతారని వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ నెల 20న రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాగా, సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు మరి కొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ఇవాళ సాయంత్రం జరిగే సీఎల్పీ భేటీలో సిద్ధరామయ్యను సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని చెప్పారు. కర్ణాటకలో పార్టీ విజయానికి విజయానికి రాహుల్ గాంధీ ,ప్రియాంక తోడ్పడ్డారని చెప్పారు. కర్ణాటకలో అందరూ కలిసి పనిచేశారని చెప్పారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే నెల రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేశారని తెలిపారు. కర్ణాటక విజయంతో కాంగ్రెస్ జోష్ లోకి వచ్చిందన్నారు.