ఏపీకి త్వరలోనే ఎన్నికలు రానున్నాయిః అంబటి

చంద్రబాబు, లోకేశ్ వేల కోట్లను దోచుకున్నారన్న అంబటి

AP elections are coming soon: Ambati

అమరావతిః టిడిపి సర్వనాశనం కావడానికి నారా లేకేశ్ కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా టిడిపి శ్రేణులు అర్థం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ వేల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు. కక్ష సాధింపులు చేయాల్సిన అవసరం వైఎస్‌ఆర్‌సిపికి లేదని అన్నారు. మీ తండ్రి వైఎస్‌ ఏమీ చేయలేకపోయారు, నీవేం చేస్తావంటూ జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారని… ఇప్పుడు జైల్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. అందుకే నోరు పారేసుకోకుండా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏం బలం ఉందని టిడిపికి మద్దతు ఇస్తారని దెప్పిపొడిచారు.

ఏపీకి త్వరలోనే ఎన్నికలు రానున్నాయని… మొత్తం 175 స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని అంబటి చెప్పారు. ఈ నెల 26 నుంచి బస్సు యాత్రను చేపట్టబోతున్నామని… మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నామని తెలిపారు.