తెలంగాణ కు మరో అరుదైన ఘనత

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ్‌లో నంబర్‌ వన్‌గా తెలంగాణ

Another rare achievement for Telangana

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. పారిశుద్ధ్యంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌ పథకంలో దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో జాబితాలో అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నది. తెలంగాణలోని అన్ని గ్రామాలు (100 శాతం) బహిరంగ మల విసర్జనరహిత (ఓడీఎఫ్‌ ప్లస్‌) గ్రామాలుగా మారాయి. దేశంలోని కొన్ని రాష్ర్టాలు మాత్రం ఇప్పుడే ఓడీఎఫ్‌ ప్లస్‌లో 50 శాతానికి చేరాయి. బుధవారం కేంద్ర జల్‌శక్తి శాఖ విడుదల చేసిన నివేదికలో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

భారత్‌ను బహిరంగ మల విసర్జనరహిత (ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ) దేశంగా మార్చేందుకు స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌ పథకం ఫేజ్‌-1ను 2014లో భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఫేజ్‌-2లో భాగంగా ఇప్పటికే 50 శాతం వరకు గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా మారాయి. ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామం అంటే.. ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థల అమలుతోపాటు అందరికీ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి బహిరంగ

మలవిసర్జనరహిత గ్రామం గా ఉండటం. దాదాపు 3 లక్షల గ్రామాలు తమను తాము బహిరంగ మల విసర్జనరహిత గ్రామాలుగా ప్రకటించుకున్నాయి. ఇతర రాష్ర్టాలకు మాడల్‌గా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం 100 శాతం ఓడీఎఫ్‌ ప్లస్‌ సాధించి ఇతర రాష్ర్టాలకు మాడల్‌గా నిలిచింది. తెలంగాణ తర్వాత స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, గోవా, సిక్కిం రాష్ర్టాలు ఉన్నాయి.

కేంద్ర పాలిత ప్రాంతాల్లో అండమాన్‌, నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌ హవేలి, డామన్‌డయ్యూ, లక్షద్వీప్‌లు కూడా ఓడీఎఫ్‌ ఫ్లస్‌ 100 శాతం సాధించాయి. సమిష్టి కృషితో లక్ష్యసాధనకు సహకరిస్తున్న గ్రామాలు, గ్రామ పంచాయతీలు, జిల్లాలు, రాష్ర్టాలు, యూటీలు అందిస్తున్న సహకారాన్ని డ్రింకింగ్‌ వాటర్‌, శానిటేషన్‌ విభాగం, జల శక్తి మంత్రిత్వశాఖ అభినందిస్తున్నది.