బిఆర్ఎస్ పరిపాలనలో ఆటో డ్రైవర్లకు సాయం చేశారా?: మంత్రి పొన్నం

Ponnam Prabhakar Speech In TS Assembly

హైదరాబాద్‌ః అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరుగుతోంది. చర్చకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదించగా.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బలపరిచారు. అనంతరం చర్చ జరుగుతోంది. అయితే శాసనసభలో ఆటో డ్రైవర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతోంది. మహాలక్ష్మీ పథకాన్ని సమర్థిస్తూనే ఆ పథకం వల్ల ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోతున్నారని, వారికి న్యాయం చేయాలని బిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా వారికి అండగా నిలిచి ఆత్మహత్యలు నిలువరించాలని కోరారు.

అయితే బిఆర్ఎస్ నేతలపై మాటలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. సభను తప్పుదోవ పట్టించేలా హరీశ్‌ రావు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం రూ.530 కోట్లను ఇచ్చిందని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పరిపాలనలో ఆటో డ్రైవర్లకు సాయం చేశారా? అని ప్రశ్నించారు. పదేళ్లలో ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు నెలకు రూ.వెయ్యి ఇచ్చారా? అని నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు అరవై రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని పొన్నం పేర్కొన్నారు.