ఢిల్లీ పాల‌నా వ్య‌వ‌హారాల‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

స్థానిక ప్రభుత్వానికే ఢిల్లీ పాలనా వ్యవహారాలు.. సుప్రీంకోర్టు

Delhi govt has control over services: SC on Delhi-Centre power row

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి గట్టి షాక్‌ తగిలింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది. ఢిల్లీ సర్కారుకు అధికారాలు లేవన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ జనరల్‌ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది.

ఇక అన్ని రాష్ట్రాల త‌ర‌హాలోనే ఢిల్లీలో పాల‌న ఉంటుంద‌ని సుప్రీం తెలిపింది. ల్యాండ్‌, పోలీస్‌, లాపై అధికారం కేంద్రానికి ఉంటుంద‌ని కోర్టు చెప్పింది. మిగిలి అన్ని అంశాల‌పై శాస‌నాధికారం కేజ్రీ స‌ర్కార్‌కు ఉంటుంద‌ని కోర్టు చెప్పింది. సీజేఐ చంద్ర‌చూడ్ తీర్పును చ‌దివి వినిపించారు. అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాసనం ఇవాళ ఏక‌గ్రీవ తీర్పును వెలువ‌రించింది. రాష్ట్ర ప్ర‌భుత్వ పరిపాల‌నా వ్య‌వ‌హార‌ల‌ను కేంద్ర స‌ర్కార్ టేకోవ‌ర్ చేసుకోరాదు అని రాజ్యాంగ ధ‌ర్మాస‌నం త‌న తీర్పులో వెల్ల‌డించింది.