బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో మరో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లి కి చెందిన బుచ్చుక అరవింద్ యూనివర్సిటీ లో పియుసి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో వ్యక్తిగత కారణాలతో హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది గమనించిన తోటి విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించడంతో సెక్యూరిటీ సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. విద్యార్థి మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులకు యూనివర్సిటీ అధికారులు సమాచారం అందించారు. మరో రెండు రోజుల్లో ఎగ్జామ్స్ జరగనుండగా అరవింద్ చనిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఎగ్జామ్స్ ఒత్తిడి తట్టుకోలేక అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పొలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.