జనసేన పార్టీకి భారీ ఊరట

జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. గ్లాసు గుర్తును జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించగా.. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని పిటిషన్‌లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇటీవల ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. ఇవాళ ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఈ తీర్పు తో జనసేన శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల్లో ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. తన పార్టీ అభ్యర్థులందరికీ నేడు బీఫాంలను అందజేయనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ మధ్యాహ్నం వారందరితో సమావేశం కానున్నారాయన. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమీక్షించనున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పిఠాపురం- పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల- లోకం మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్- పంతం నానాజీ, రాజానగరం- బత్తుల బలరామకృష్ణ, తెనాలి- నాదెండ్ల మనోహర్, నిడదవోలు- కందుల దుర్గేష్, పెందుర్తి- పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్ పోటీ చేయబోతున్నారు.