ట్విట్టర్ పై అమెరికా అధ్యక్షుడి విమర్శలు

మస్క్ చేతికి.. అబద్ధాలను వ్యాప్తి చేసే వేదిక.. జో బైడెన్

US President Joe Biden
US President Joe Biden

వాషింగ్టన్ః ట్విట్టర్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శలు గుప్పించారు. దాన్నొక అబద్ధాల పుట్టగా అభివర్ణించారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొన్ని రోజుల క్రితమే 44 బిలియన్ డాలర్లు వెచ్చించి (రూ. 3.6 లక్షల కోట్లు) ట్విట్టర్ లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయడం తెలిసిందే. అప్పటి నుంచి మస్క్ వరుసగా సంచలన నిర్ణయాలతో ట్విట్టర్ ను నిత్యం వార్తల్లో ఉంచుతున్నారు. దీని ద్వారా మస్క్ ట్విట్టర్ కు మరింత ప్రచారాన్ని కల్పించుకుంటున్నారనే విమర్శ ఉంది.

తాజాగా శుక్రవారం చికాగోలో ఓ నిధుల సమీకరణ కార్యక్రమం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు మనమంతా ఆందోళన చెందాల్సినది ఏమిటంటే..? ప్రపంచవ్యాప్తంగా అబద్ధాలను వ్యాప్తి చేసే, అబద్ధాలను చిమ్మే వేదికను (ట్విట్టర్) ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాడు. ఇంక అక్కడ ఎడిటర్లు ఎంత మాత్రం ఉండరు. ప్రమాదకరమైన వాటిని పిల్లలు అర్థం చేసుకోగలరని మనం ఎలా ఆశిస్తాం’’అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ కొనుగోలు చేసిన 10 రోజుల్లోనే సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసిన మస్క్.. బ్లూటిక్ యూజర్లకు నెలవారీ ఫీజును భారీగా పెంచేయడం తెలిసిందే.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/