అంగన్‌వాడీల ‘ఛలో విజయవాడ’ నిరసనలో ఉద్రిక్తత

జీవో నంబర్‌ 1 ను రద్దు చేయాలని, అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ, వామపక్ష పార్టీలు సోమవారం ఛలో విజయవాడ కు పిలుపునిచ్చాయి. దీంతో వేలాదిమంది అంగన్‌వాడీ కార్యకర్తలు , టీడీపీ శ్రేణులు విజయవాడ వస్తుండడం తో వారిని పోలీసులు ఎక్కడిక్కడే అడ్డుకుంటూ అదుపులోకి తీసుకుంటున్నారు.

రైల్వే స్టేషన్, బస్టాండ్, ధర్నాచౌక్, ప్రకాశం బ్యారేజ్, రామవరప్పాడు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అరెస్ట్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేసి భవానీపురం, సూర్యాపేట, గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అంగన్ వాడీల ఆందోళనకు మద్దతు తెలిపిన టీడీపీ లీడర్లను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అంగన్‌వాడీల అరెస్టులను ఖండించిన సీపీఎం… వారి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ దమనకాండను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ పిలుపు మేరకు ఆందోళనకు వస్తున్న మహిళలను దౌర్జన్యంగా అరెస్టులు చేయడం శోచనీయమన్నారు. పెత్తందారులపై యుద్ధం అంటూ పేద మహిళ అంగన్‌వాడీలపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందన్నారు. ముందస్తు అనుమతి కోరినా.. ధర్నాకు అనుమతి ఇవ్వకుండా వచ్చిన వారిని వచ్చినట్టు విచక్షణారహితంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ అంగన్‌వాడీల కోర్కెలపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయాలని, సీఎం తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని బాబురావు అన్నారు.