పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పౌలీసుల గౌరవ వందనం స్వీయకరించారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింద‌ని , రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందని తెలియపరు. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా, ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నామని గుర్తు చేసారు. ఇక ఇప్పుడు దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నామ‌ని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం మనందరికీ సువిదితమే. నాడు అవలంబించిన అనేక వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరపిన త్యాగాలలో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయింద‌ని కేసీఆర్ అన్నారు. స్వతంత్రం రాకముందు భారతదేశ స్వరూపం భిన్నంగా ఉండేద‌ని, కొంతభాగం బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించే బ్రిటిష్ ఇండియాగా ఉంటే.. మిగతా భాగం సంస్థానాధీశుల పాలనలో ఉండేది. కొన్ని ప్రాంతాలు ఫ్రెంచ్, పోర్చుగీస్ వారి వలస పాలనలో ఉండేవి. ప్రపంచంలో ఏ దేశమైనా పరిణామ క్రమంలో సమగ్ర స్వరూపాన్ని సంతరించుకుంది. మన భారతదేశం కూడా అంతే సీఎం కేసీఆర్ అన్నారు.