ఏపి శాసన మండలిలో గందరగోళం

Shariff Mohammed Ahmed
Shariff Mohammed Ahmed

అమరావతి: ఏపి శాసన మండలిలో మళ్లీ గందరగోళ వాతావరణం నెలకొంది. రూల్‌ 71 పై చర్చ ప్రారంభించాలంటూ టిడిపి సభ్యులు నినాదాలు చేశారు. ముందుగా ఈ అంశంపై చర్చ జరపాలని, తర్వాతే మిగతా అంశాలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. కాగా దీనిపై వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది మండలి సంప్రదాయానికి విరుద్ధమని, మొదటగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. దీనిపై టిడిపి సభ్యులకు ఎక్కువ సంఖ్యాబలం కలిగి ఉండడంతో రూల్‌ 71 కింద చర్చకు చైర్మన్‌ షరీఫ్‌ అనుమతిచ్చారు. కాగా ఈ అంశంపై టిడిపి సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ చర్చను ప్రారంభించగా వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు అడ్డుకున్నారు. మంత్రులు చైర్మన్‌ పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై చర్చించాలని నినాదాలు చేశారు. దీంతో మంత్రి బొత్స కల్పించుకుని చైర్మన్‌ టిడిపికి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. చైర్మన్‌ టిడిపి సభ్యులు చెప్పినట్లే నడుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రూల్‌ బుక్స్‌, నిబంధనలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనల కారణంగా సభలో మళ్లీ గందరగోళం నెలకొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/