సముద్రఖని గారి వల్లే విమానంలో ఆ పాత్ర కు ఒప్పుకున్న – అనసూయ

జబర్దస్త్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ..వెండితెర ఫై కూడా రాణిస్తూ వస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమెలో మంచి నటి ఉందని విషయాన్నీ బయటపెట్టింది. ఆ తర్వాత నుండి వరుస అవకాశాలు అమ్మడి తలుపు తడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈమె విమానంలో మూవీ సుమతి పాత్రలో నటించింది. రేపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జీ స్టూడియోస్ – కిరణ్ కొర్రపాటి కలిసి నిర్మించిన ఈ సినిమాకి, శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించాడు. సముద్రఖని .. అనసూయ .. ధన్ రాజ్ .. మాస్టర్ ధృవన్ ప్రధానమైన పాత్రలను పోషించారు.

తాజాగా చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న అనసూయ..తన పాత్ర గురించి..ఆ పాత్ర ఎలా వచ్చింది..ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందనే విషయాలు తెలిపింది. “డైరెక్టర్ గారు కథ చెప్పగానే ఈ సినిమాలో నేను తప్పకుండా భాగమవ్వాలి అనిపించింది. సాధారణంగా ఒక పాత్రకి ఒప్పుకోవాలంటే డేట్స్ ఎలా కావాలి .. నిడివి ఎంత .. రెమ్యునరేషన్ ఎంత? అనేవి ఆలోచన చేస్తుంటారు. నేను మాత్రం అవన్నీ పక్కన పెట్టేస్తాను. ఆ కథ నాకు ఎంతవరకూ నచ్చింది అని మాత్రమే ఆలోచన చేస్తాను” అని , “ఒకవేళ కథ నచ్చితే .. అందులో నేను ఎంత కొత్తగా కనిపిస్తాను? నా పాత్రలో ఉన్న కొత్తదనం ఏమిటి? అనే విషయాలపై దృష్టిపెడతాను. ఎమోషన్స్ తో కనిపించాలా .. గ్లామరస్ గా కనిపించాలా అనేది కాదు. నా పాత్ర ఎంటర్టయినింగ్ గా ఉందా లేదా అనేది చూస్తాను. ఈ సినిమాలో నేను సుమతి పాత్ర చేయడానికి అంగీకరించడానికి కారణం, కథ .. సముద్రఖని గారు” అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.