అమెరికా కొత్త వీసా బిల్లుతో విదేశీయులకు ఉపాధి!

భారతీయ అమెరికన్లకే ఎక్కువ లాభం

America's new visa bill- More profit for Indian Americans
America’s new visa bill- More profit for Indian Americans

బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కీలక ఉత్తర్వులపై సంతకాలు చేసిన అమెరికా 46వ అధ్యక్షుడు జోబైడెన్‌ తనదైనశైలిని ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చిన అధ్యక్షుడు ఇప్పుడు వీసాలపై అనుసరిస్తున్న కొత్తవిధానంతో అత్యధికశాతం భారతీయ అమెరికన్లకే ఎక్కువ లాభం చేకూరుతోంది.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలను సవరించడం లేదా రద్దుచేయడం వంటివి ఇప్పుడు బైడెన్‌ చేపట్టినా విమర్శల పాలుకాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నా రనిపిస్తోంది. మెక్సికో సరిహద్దుల్లో గోడనిర్మాణం,ఆ గోడ నిర్మాణంకోసం మెక్సికోనుంచి వచ్చే దిగుమతులపై 20 శాతం సుంకం వసూలుచేయడం, వాతావరణ మార్పులపై ప్యారిస్‌లోజరిగిన ప్రపంచదేశాల ఒప్పందంపై మళ్లీ భాగ స్వామికావడం వంటివి ఇప్పుడు బైడెెన్‌చేపడుతున్న కీలక చర్యలు.

అంతేకాకుండా కరోనావైరస్‌ను సకాలంలో గుర్తించి హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ విఫలమైందని, పైగా చైనాపక్షపాతిగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ మాజీ అధ్యక్షుడు డబ్ల్యు హెచ్‌ఒకు ఇచ్చే 400 మిలియన్‌ డాలర్ల సాయం నిలిపి వేయడంతోపాటు ఆ సంస్థసభ్యత్వంనుంచి కూడా బైటకు వచ్చేసారు. ఇక ఉత్తరకొరియా, చైనాలపట్ల అనుసరించిన వైఖరిని పునఃసమీక్షించడం ప్రస్తుతం బైడెన్‌ చేయాల్సిన అత్యవసర విదేశీ విధానాల్లో ఒకటి. కరోనా కారణంగా చైనాతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే.

తాజాగా 20మంది అమెరికా అధికారు లపై చైనా వేటువేయడం వీరిని తమ దేశాల్లోకి అనుమ తించేదిలేదని ప్రకటించడం వంటివాటిపై స్పందించాల్సిన అవసరంఉంది. ఇప్పటికిప్పుడు తనదేశంలో జోరు అందు కున్న కరోనాను కట్టడిచేసేందుకు ప్రకటించిన వందరోజుల ప్రణాళిక అమలు కూడా బైడెన్‌కు కీలక సవాళ్లలో మొట్ట మొదటిది అని చెప్పాలి. వీటన్నింటితోపాటు అక్రమంగా అంటే ఎలాంటి అనుమతులులేకుండా అమెరికాలో నివసి స్తున్న 11 మిలియన్లమందికి మేలుచేసేవిధంగా బైడెన్‌ చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టం ఇప్పుడు బహుళ ప్రయోజనకారిగా మారుతోంది.

ఎనిమిదేళ్లపాటు అను మతించేందుకు వీలుగా కొత్త పౌరసత్వం ఇచ్చేందుకు అనువైన చట్టాన్ని తీసుకువస్తున్నారు. అమెరికా పౌర సత్వం చట్టం 2021పేరిట వచ్చిన ఈబిల్లుపై అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొద్దిగంటల్లోనే బైడెన్‌ సంతకంచేసి ఆమోదించేందుకు కాంగ్రెస్‌ ప్రతినిధులసభకుపంపించారు. అలాగే అనుమతులులేని నివాసితులను బలవంతంగా పంపించే కార్యాచరణను వచ్చే మార్చి వరకూ నిలిపి వేయాలన్నారు.

ఈ చర్యలవల్ల కేవలం హెచ్‌1బివీసా దార్లే కాకుండా వారి కుటుంబీకులు, వారిపై ఆధారపడిన వారికి,బాల్యంలోనే వచ్చి అమెరికాలోస్థిరపడిన డ్రీమర్స్‌కు సైతం మేలుజరుగుతుందని అంచనా. అలాగే హెచ్‌1బి వీసాలతో విశేష ప్రయోజనాలు పొందుతున్న భారతీయ సాంకేతిక నిపుణులు ఇతర వృత్తినిపుణులు విద్యార్థులకు ఈ బిల్లుకొత్త ఏడాదిలో మళ్లీ ఆశలు చిగురింపచేస్తోంది. అధ్యక్షుడు ఈ బిల్లును వెంటనే అమలుకు తెచ్చే లక్ష్యం తోనే కాంగ్రెస్‌కు పంపించారు.

అమెరికా సుసంపన్నం అయ్యేందుకు దశాబ్దాల తరబడి శ్రమపడిన అనేకమందికి పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశ్యమని, ఈ బిల్లు ద్వారానే కొత్త అధ్యక్షుడు,పాలన యంత్రాంగానికి ఉన్న ప్రాధాన్యతలేమిటో అర్థం అవుతాయని శ్వేతసౌధం అధి కారులు వివరిస్తున్నారు.

వీటితోపాటుగానే సరిహద్దులను బాధ్యతాయుత నిర్వహణ,ఆర్థికవృద్ధి,మధ్యఅమెరికా దేశాల నుంచి వలసలకు మూలకారణాలు అన్వేషించి,ప్రధానమైన శరణార్ధులకు అమెరికా ఆశ్రయం కల్పించడం వంటి కీలక చర్యలకు కొత్త అధ్యక్షుడు బైడెన్‌శ్రీకారంచుట్టి ప్రపంచదేశా లను ఆకర్షిస్తున్నారు.

కొత్త చట్టంతో ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డు లంభించేందుకు దేశాలకున్న పరిమితులన్నీ తొలగిపో తాయి. ఈ పరిమితివల్ల భారతీయులు, సాఫ్ట్‌వేర్‌నిపుణు లకు జరిగే నష్టాన్ని భర్తీచేసినట్లవుతుంది. ఇప్పటివరకూ వీసాలజారీలో దేశాలపరిమితం ఏడుశాతం ఉంటే చిన్న పెద్ద దేశాలనే తేడాలేదు. ఇప్పుడు ఈ ఆంక్షల న్నింటినీ ఎత్తివేస్తున్నారు.

వాస్తవానికి ఈపరిమితిని ఏడు నుంచి 15 శాతానికి పెంచాలని నిర్ణయించారు.ఇందుకోస మే అత్యధిక నిపుణులైన వలసనిపుణుల చట్టాన్నికూడా తీసుకువచ్చారు. అయితే ఆ బిల్లులో కఠినఆంక్షలు,నిబంధనలు ఉండటంతో వాటన్నింటినీ తొలగించి కొత్త పౌరసత్వ చట్టాన్ని తెరపైకి బైడెన్‌ తెచ్చారు.పెండింగ్‌లో ఉన్న మిలియన్లకొద్దీ దర ఖాస్తులకు అనుమతిలభించడంతోపాటు హెచ్‌వన్‌బి వీసా దారులు ఉద్యోగంచేసుకునే అవకాశం కూడా కలుగుతుంది.

అమెరికాలో చదువుతున్న ‘స్టెమ్‌ అంటే సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణితం పట్ట భద్రులు ఇతర ఉన్నత మేధా వులు దేశంలో నివసించేందుకు వీలుకలుగుతోంది. వీరి సేవలద్వారా అమెరికా ఆర్థికవృద్ధి మరింత పెరుగుతుందని బైడెన్‌టీమ్‌ భావిస్తోంది.

అమెరికాలో లెక్కలు తేలని అక్రమ వలసదారులు సుమారుగా 12మిలియన్ల వరకూఉంటారని ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ అధికారులే చెపుతున్నారు. ఇప్పుడు వీరందరికీ గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కలగుతున్నది.

కొత్త బిల్లును అనుసరించి వీసాలను 55వేల నుంచి 80వేలకుసైతం పెంచేఅవకాశం లేకపోలేదు.అలాగే తక్కువ వేతనం పొందుతున్నవారికి కూడా గ్రీన్‌కార్డులు పొందే సౌలభ్యం కల్పిస్తోంది.

అయితే గ్రీన్‌కార్డుకోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు ఈ ఏడాది జనవరి నాటికి అమెరికాలోనే ఉండాలి. రెండేళ్లక్రితంనుంచి అమెరికా నుంచి నిర్బంధంగా పంపించినవారిని కూడా పరిశీలించి డిహెచ్‌ఎఫ్‌ మినహా యింపులతో వారికి అవకాశాలిస్తారు.

మొత్తంగాచూస్తే విదేశాంగ విధానాలను సమూలంగా మార్చివేయడంతో పాటు ఇమ్మిగ్రేషన్‌ విధానాలను సవరించడంద్వారా బైడెన్‌ విదేశీయులను ఆకర్షించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్, హైదరాబాద్

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/