అత్యద్భుతమైన, మరపురాని అయోధ్య దీపోత్సవంః ప్రధాని మోడీ

22.23 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవ్

‘Amazing and unforgettable’.. PM Modi shares Ayodhya Deepotsav pictures on Diwali

న్యూఢిల్లీః దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సరయూ నది తీరంలో నిర్వహిచిన ఈ వేడుకలో భాగంగా ఒకేసారి 22.23 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. గతేడాది కంటే 6.47 లక్షల దీపాలను అధికంగా వెలిగించారు. ఇది ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ను సొంతం చేసుకుంది. ఈ ఫొటోలను పంచుకున్న మోడీ దీపోత్సవాన్ని అత్యద్భుతమైన, మరపురాని వేడుకగా అభివర్ణించారు.

కాగా, అయోధ్య గతేడాది 15 లక్షల దీపాలు వెలిగించి నెలకొల్పిన రికార్డును ఈసారి అంతకుమించిన దీపాలతో తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఈ కార్యక్రమంలో 25 వేల మందికిపైగా వలంటీర్లు భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది 51 వేల దీపాలు వెలిగించారు. ఆ తర్వాతి నుంచి ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది దీపోత్సవ్‌లో 50 దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.