మరో బాలుడి ఫై వీధి కుక్కల దాడి

ఆదివారం పెద్ద అంబర్ పేట్ లో నాలుగేళ్ల బాలుడి ని వీధి కుక్కలు చంపేసిన ఘటన మరవకముందే..మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం ఎస్సీ హాస్టల్‌లోకి చొరబనడిన వీధి కుక్క విద్యార్థిపై దాడి చేసింది. ఈ దాడిలో 7వ తరగతి చదువుతున్న సుమంత్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే హాస్టల్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం బాగానే ఉంది.

ఇక పెద్ద అంబర్ పేట్ ఘటన విషయానికి వస్తే..నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌ గత కొంతకాలంగా హైదరాబాద్‌ లో ప్రవైట్ జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గంగాధర్ తన భార్య, ఆరేళ్ల కుమార్తె, కుమారుడు ప్రదీప్‌తో కలిసి బాగ్‌అంబర్‌పేట ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలిద్దర్నీ తీసుకుని తాను పనిచేస్తున్న సర్వీస్‌ సెంటర్‌‌కు తీసుకెళ్లాడు గంగాధర్. కూతుర్ని పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి.. ప్రదీప్‌ను సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తీసుకెళ్లాడు.

గంగాధర్ ఏదో పని చేస్తూ అక్కడే ఉండిపోగా.. ప్రదీప్ తన అక్క దగ్గరికి ఒంటరిగా వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే.. మూడు వీధి కుక్కలు వెంటపడ్డాయి. కుక్కలను చూసి వణికిపోయిన ప్రదీప్.. వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ.. చుట్టుముట్టిన కుక్కలు.. విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. కుక్కలు తన శరీరాన్ని ఛిద్రం చేస్తుంటే.. తట్టుకోలేక ఆర్తనాదాలు చేయడం తో అది విన్న అక్క.. వెంటనే తండ్రికి సమాచారమిచ్చింది. వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న గంగాధర్.. కుక్కలను వెల్లగొట్టటంతో బాలుడిని వదిలేశాయి. కానీ అప్పటికే.. ఆ బాలుడి శరీరం కుక్కల గాట్లతో రక్తసిక్తమైంది. తీవ్ర గాయాలపాలైన కొడుకును తీసుకుని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. పరిశీలించిన వైద్యులు.. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో.. కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది.