ఢిల్లీలో మరింత తీవ్రంగా వాయు కలుష్యం..సుప్రీంకోర్టు నిషేధాన్ని పక్కనపెట్టి నగర వాసులు

ఆంక్షల అమలులో అధికారులు విఫలమయ్యారన్న పర్యావరణవేత్త భవ్రీన్ కంధారి

Delhi Residents Celebrate Diwali With Crackers Despite Supreme Court Ban

న్యూఢిల్లీః ఢిల్లీ వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ వాసులు పోటీపడి పటాకులు కాల్చడంతో పొల్యూషన్‌ పెరిగింది. నగరంలో వాహనాల రద్దీ పెరగడం, పంజాబ్‌లో పంట వ్యర్థాల కాల్చివేత కారణంగా ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఎయిర్‌ పొల్యూషన్‌ పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగనాడు పటాకులు కాలిస్తే కాలుష్యం మరింత తీవ్రమవుతుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పండుగరోజు ఢిల్లీ నగరంలో పటాకులు కాల్చడంపై నిషేధం విధించింది.

అయితే, సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలను ఢిల్లీ వాసులు భేఖాతర్‌ చేశారు. దీపావళి రోజు రాత్రి యథేచ్ఛగా పోటీపడి పటాకులు కాల్చారు. దాంతో ఇవాళ ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) సగటు 286కు చేరింది. ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ, ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 దాటింది. ఇతర ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉన్నది.

ఆదివారం రాత్రి పటాకులు కాల్చడంతో సోమవారం ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాలపై దట్టమైన విషపూరిత పొగమంచు కమ్మింది. పండుగరోజైన ఆదివారం ఉదయం 202గా ఉన్న ఢిల్లీ యావరేజ్‌ ఏక్యూఐ, ఇవాళ ఉదయం 286కు పెరిగింది. రహదారులపై కమ్ముకున్న దుమ్ముధూళి కారణంగా విజుబిలీటీ బాగా తగ్గిపోయింది. 50 మీటర్ల దూరం కూడా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.