జూలై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర..

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర జూలై 1 నుంచి మొదలై.. ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. 62 రోజుల పాటు సాగనున్న ఈ పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు జమ్మూకాశ్మీర్ యంత్రాంగం ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత ఏప్రిల్ 17న ప్రారంభమైంది. యాత్రకు సంబంధించి J&K పరిపాలనా విభాగం కూడా అనేక ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అమర్‌నాథ్ యాత్రలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ల సెలవులను రద్దు చేశారు.

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు. గత ఏడాది 3.45 లక్షల మంది అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనగా ఈసారి 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆకస్మిక వరదల కారణంగా 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక అమర్‌నాథ్ యాత్రలో యాత్రికులు కూల్ డ్రింక్స్, కరకరలాడే స్నాక్స్, డీప్ ఫ్రైడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, జిలేబీ మరియు హల్వా వంటి స్వీట్లు, పూరీలు తీసుకోలేరు. ఎందుకంటే శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు జారీ చేసిన వార్షిక యాత్రకు సంబంధించిన ఆరోగ్య సలహాలోయాత్రికుల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల శ్రేణిని నిషేధించింది.