15వ రోజు ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర

amaravati-farmer-maha-padayatra-enters-into-15-th-day

ఏలూరుః నేడు ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతున్నది. ఏలూరు జిల్లాలోని గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతానికి చేరుకుని వారికి మద్దతుగా నిలిచారు. యువత కూడా పెద్ద సంఖ్యలో హాజరైంది. ఈరోజు కొనికి నుంచి ప్రారంభమయ్యే మహా పాదయాత్ర కొత్తూరు వరకు కొనసాగనున్నది. 14వ రోజున 15 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర.. కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొణికి గ్రామం నుంచి 15 వ రోజు పాదయాత్ర మొదలైంది. ఎక్కడికక్కడ స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. దారిపొడవునా ట్రాక్టర్లపై నుంచి రైతులపై పూలవర్షం కురిపించారు. వృద్ధులు, మహిళలు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. పాదయాత్రకు అన్ని ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తున్నది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గుడివాడ సంఘటన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును కల్పించారు. పెదపాడు వద్ద భోజన విరామం కోసం ఆగుతారు. కృష్ణా జిల్లాలో 6 రోజుల పాటు మహా పాదయాత్ర కొనసాగింది. అనంతరం ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. కృష్ణా జిల్లా కుదరవల్లికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. ఏలూరు జిల్లాలోకి పాదయాత్రను ఆహ్వానించారు. అమరావతి నినాదాలతో కృష్ణా, ఏలూరు జిల్లాల సరిహద్దు గ్రామాలు మార్మోగాయి. ఇవాల మొత్తం 15 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని రైతులు నిర్ణయించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/