రేపటి నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర

సీఎం జగన్ రేపు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 10.56గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ఆరంభిస్తారు. ఇచ్ఛాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల యాత్ర చేపట్టనున్నారు.

ఇక, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్‌ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్‌ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం వైయ‌స్‌ జగన్‌ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు.