చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు..

టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడో రోజు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బలభద్రపురం వద్ద చంద్రబాబు వాహనం ముందుకు కదలకుండా పోలీసు బస్సును అడ్డం పెట్టారు పోలీసులు. చంద్రబాబును అడ్డుకున్నారన్న సమాచారంతో పరిసర గ్రామాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకనే అనపర్తి చేరుకున్నారు. మార్గమధ్యంలో కార్యకర్తలు అందించిన కొబ్బరిబోండాం తాగి సేద దీరారు. చంద్రబాబు బలభద్రపురంలో బయల్దేరే సమయానికి చీకట్లు ముసురుకోగా, ఆయన సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే అనపర్తి వరకు 7 కిలోమీటర్లు నడిచారు. ఇక అనపర్తిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపైనా, పోలీసుల పైనా నిప్పులు చెరిగారు. ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితిలో అనపర్తి వచ్చానని అన్నారు. ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు చెబుతున్నా… ఈ అనపర్తి నుంచి సహాయ నిరాకరణ ప్రారంభించాను అని వెల్లడించారు.

“నేనేమైనా పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చానా? నేను ఇక్కడికి వచ్చే హక్కు లేదా? ప్రజల కోసం ఎన్నో అవమానాలు భరించా. నా పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చిన పత్రాలు ఇవిగో. పోలీసులు నా దగ్గర పనిచేసినవారే. జగ్గంపేటకు వెళితే పోలీసులు సహకరించారు, పెద్దాపురం వెళితే పోలీసులు సహకరించారు… కానీ అనపర్తి వద్దామనుకుంటే అడ్డుపడ్డారు. ఇక్కడ గ్రావెల్ సూర్యనారాయణ అని ఒకడున్నాడు… ఖబడ్దార్ గ్రావెల్ సూర్యనారాయణ! నాతో పెట్టుకుంటున్నావు… జాగ్రత్తగా ఉండు! తమాషా అనుకోవద్దు. నేను తమాషా రాజకీయాలు చేయడంలేదు. నేను భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నా” అని చంద్రబాబు హెచ్చరించారు. తానేమీ సీఎం కావాలని కోరుకోవడంలేదని అన్నారు. ప్రజల కోసమే తన పోరాటం అని, భవిష్యత్ తరాల కోసమే తాను పనిచేస్తున్నానని ఉద్ఘాటించారు. నేను కూడా పారిపోతే మిమ్మల్ని చంపినా దిక్కులేదంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.