భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా అజిత్‌ అగార్కర్‌

భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ కు కీలక పదవి దక్కింది. భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ అతణ్ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం ప్రకటించాడు. ”సులక్షణ నాయక్‌, అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపెలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ సెలక్షన్‌ కమిటీలో ఖాళీ అయిన ఒక స్థానానికి ఇంటర్వ్యూలు నిర్వహించింది. కమిటీ ఏకగ్రీవంగా అగార్కర్‌ను ఎంపిక చేసింది. అనంతరం మిగతా సెలక్టర్లతో పోలిస్తే ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉన్న అతడినే సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపాదించింది” అని షా ఒక ప్రకటనలో తెలిపారు.

అజిత్ అగార్కర్ 1998 నుంచి 2007 వరకు 191 వన్డేలు, 26 టెస్టు మ్యాచ్ లు, నాలుగు టీ 20 మ్యాచ్ లు ఆడారు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో అజిత్ అగార్కర్ ఉన్నారు. ఈయన లార్డ్స్ లో టెస్టు శతకం సాధించారు. రిటైర్మెంట్‌ తర్వాత అగార్కర్‌ చాలా ఏళ్ల నుంచి క్రికెట్‌ విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.