భారీ వర్షాలు..విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి

2-killed-3-injured-as-giant-boulders-crush-cars-after-landslide-in-nagaland

కోహిమా: నాగాలాండ్‌లోని చమౌకేడిమా జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఓ పెద్ద బండరాయి అమాంతం రెండు కార్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా, మరొకరు దవాఖానలో చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

చమౌకేడిమా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దిమాపూర్‌ నుంచి కోహిమా మధ్య 29వ నంబర్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో పకల్‌ పహర్‌ వద్ద వాహనాలు నిలిచిపోయాయి. అయితే భారీ వర్షాలకు పక్కనే ఉన్న ఎత్తయిన కొండపై నుంచి ఓ భారీ బండరాయి రోడ్డుపై ఉన్న వాహనాలపైకి దూసుకొచ్చింది. దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. క్షణాల్లోనే మరో బండరాయి ఇంకో కారుపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ప్రమాదానికి గురైన కార్ల వెనుక ఉన్న మరో వాహనంలోని ఉన్న వీడియో తీశాడు. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

కాగా, ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి వెంబడి ప్రమాదకర ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి భారత ప్రభుత్వం, నేషనల్‌ హైవే నిర్వాహకులతో కలిసి చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.