సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపు

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ విజయడంఖా మోగించింది. అత్యధిక ఓట్లతో నక్షత్రం గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు. INTUCపై దాదాపు 2 వేల ఓట్ల ఆధిక్యంతో AITUC గెలుపొందింది. దాంతో.. సింగరేణిలో గుర్తింపు సంఘంగా AITUC ఆవిర్భవించింది. సింగరేణిలో మొత్తం 11 ఏరియాలు ఉండగా.. 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి.

బెల్లంపల్లి రీజియన్‌లోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో, రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో AITUC విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్‌ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాలో, రామగుండం రీజియన్‌లోని రామగుండం-3లో INTUC గెలుపొందింది. సింగరేణి ఎన్నికల్లో ఉదయం నుంచే కార్మికులు పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులు దీరారు. దాంతో.. గంటగంటకూ పోలింగ్‌ శాతం పెరిగింది. సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో జరిగిన ఎన్నికల్లో 94.15 పోలింగ్‌ శాతం నమోదైంది. మొత్తం 39,773 మంది ఓటర్లు ఉండగా.. 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వాస్తవానికి ఏఐటీయూసీకి మొదటి నుంచి సింగరేణిలో సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటుంది. అదే సమయంలో, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు కూడా వారికే మద్దతు తెలిపారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ అనుబంధ సంఘ ఐఎన్‌టీయూసీ గెలిస్తే ఆ పార్టీ బలపడుతుందని భావించిన టీబీజీకేఎస్ నేతలు ఐఎన్‌టీయూసీని ఓడించేందుకు ఏఐటీయూసీకి మద్దతు తెలిపారు. దీంతో ఆ యూనియన్‌కు అది అదనపు బలం అయ్యింది. దీంతో మూడు ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది.