మళ్లీ కేసీఆరే సీఎం – మంత్రి కేటీఆర్

రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘనవిజయం సాదిస్తుందని , మళ్లీ సీఎం కేసీఆరే అవుతారని ధీమా వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్. మంగళవారం ఎల్‌బీనగర్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నాగోల్‌, ఎల్‌బీ నగర్‌ వరకు మెట్రో పూర్తయ్యింది. నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మధ్య ఐదు కిలోమీటర్ల మార్గాన్ని రెండో ఫేజ్‌లో కలిపే ప్రయత్నం చేస్తాం అన్నారు.

హైదరాబాద్ చుట్టూ ఉండే మున్సిపాలిటీల్లో రూ.220 కోట్లతో అభివృద్ధి పనులను చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది సుమారు 28 రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‭కు వచ్చి నివాసం ఉంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ది పనులు జరిపిస్తామని తెలిపారు. రూ.985 కోట్లతో నాలాల పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇక మూసీనది పై 14 కొత్త బ్రిడ్జిలను త్వరలో కట్టబోతున్నామని కేటీఆర్ అన్నారు.

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ పరిధిలో రూ.55కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఓ వైపు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందేలా సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్‌ కిట్‌ ఇలా ఎన్నో రకాల పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభుత్వం ఆదుకుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాదిస్తుందని , కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేసారు.