బాలీవుడ్ లో విషాదం : బిగ్‌బాస్‌ విన్నర్ సిద్ధార్థ్‌ శుక్లా మృతి

బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విన్నర్, బుల్లితెర నటుడు సిద్ధార్థ్‌ శుక్లా కన్నుమూశారు. ముంబైలోని కూపర్ హాస్పిటల్ సిద్ధార్థ్ మరణాన్ని ధృవీకరించింది. 40 ఏళ్ల సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక గుండెపోటుతో గురువారం ఉదయం 10.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి నిద్రపోయే ముందు అతను కొన్ని మెడిసిన్స్‌​ తీసుకున్నట్లు, ఆ తరువాత మేల్కోలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. సిద్ధార్థ్‌కు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. టీవీ పరిశ్రమలో మంచి పేరున్న సిద్ధార్థ్ శుక్లా, రియాలిటీ షో బిగ్ బాస్ 13 వ సీజన్‌ను గెలుచుకున్నాడు, ఇది కాకుండా అతను ఖత్రోన్ కే ఖిలాది ఏడవ సీజన్‌ను కూడా గెలుచుకున్నాడు.

12 డిసెంబర్ 1980 న ముంబైలో జన్మించిన సిద్ధార్థ్ శుక్లా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2004 సంవత్సరంలో, అతను టీవీలో తన కెరీర్ ప్రారంభించాడు. 2008 లో, అతను బాబుల్ కా ఆంగన్ చోటే నా అనే టీవీ సీరియల్‌లో కనిపించాడు, కానీ అతని నిజమైన గుర్తింపు బాలికా వధు అనే సీరియల్ తర్వాతే వచ్చింది. ఇక ఈ ఏడాది బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే అతని వెబ్ సిరీస్ వచ్చింది, ఇది ఎక్కువగా వార్తల్లో నిలిచింది. సిద్ధార్థ్ శుక్లా మరణం పట్ల అభిమానులు , సినీ ప్రముఖులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.