ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు నిరసన సెగ

మానకొండూరు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వరుస నిరసనల సెగలు ఆగడం లేదు. రీసెంట్ గా గన్నేరువరం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన యువజన సంఘాలు తమకు డబుల్ లైన్ రోడ్డు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ధర్నా చేస్తుండగా..అటుగా వచ్చిన రసమయిని నిరసనకారులు అడ్డుకునే యత్నం చేశారు. రసమయి కాన్వాయ్ ఆపకుండా ముందుకు సాగారు. తమకు సమాధానం కూడా చెప్పరా? అంటూ రసమయి కాన్వాయ్ పై దాడికి యత్నించారు. ఈ ఘటన ఇంకా మరచిపోకముందే మరో నిరసన సెగ తగిలింది.

గద్దపాక గ్రామంలో రేషన్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను అఖిలపక్షం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేను కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డుకుంటారా..? అంటూ అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రజాస్వామ్య బద్దంగా గ్రామంలోని సమస్యలను తెలియజేసేందుకు వస్తే పోలీసులను ఉపయోగించి అడ్డుకోవడం సరికాదంటూ అఖిపక్ష నాయకులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడం సరికాదన్నారు.