బైక్‌ను ఢీకొన్న నటుడు రఘుబాబు కారు..బిఆర్ఎస్ నేత మృతి

ప్రముఖ సినీ నటుడు రఘుబాబు కారు ఢీ కొని బిఆర్ఎస్ నేత మృతి చెందిన ఘటన హైదరాబాదు నుండి మిర్యాలగూడ హైవే ఫై జరిగింది. నల్లగొండకు చెందిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు..కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న KA 03 MP 69 14 నెంబర్ గల BMW కారు జనార్దన్ రావు వెళుతున్న బైక్ ను బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో జనార్దన్ రావు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని భార్య నాగమణి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంగా తెలిసింది. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, తనయుడు ఉన్నారు. ఆ కార్ నటుడు రఘుబాబు ది గా తేలింది. ఆ సమయంలో తన డ్రైవర్ డ్రైవ్ చేస్తుండగా రఘుబాబు పక్కన కూర్చుని ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత రఘుబాబు అక్కడినుండి వెళ్లినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ప్రమాదం అనంతరం రఘుబాబుతో స్థానికులు మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. బైక్‌పై వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు.. ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబు వారితో మాట్లాడటం దిగువన వీడియోలో చూడొచ్చు. అయితే రఘుబాబు టెన్షన్ పడుతూ ఉండగా.. పక్కన ఉన్న వ్యక్తులు వాటర్ తాగమని సూచించారు.