తీహార్ జైల్లో మసాజ్ లు చేయించుకుంటున్న ఆప్ మంత్రి

, AAP leader Satyendar Jain gets oil massage in Tihar jail

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్‌ అయిన ఆమ్‌ ఆద్మీపార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌.. తీహార్ జైల్లో సకల భోగాలు అనుభవిస్తున్నాడు. సొంత ఇంట్లో ఎలాగైతే పనులు చేయించుకుంటాడో..ఆలా సత్యేంద్ర జైన్‌ జైల్లో చేయించుకుంటున్నాడు. ఇప్పటికే జైలులో ఆయనకు వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్తలు బయటికి రావడంతో తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌ను సస్పెండ్ చేయగా… తాజాగా జైన్ మ‌సాజ్ చేయించుకున్న వీడియోలు బయటకు వచ్చాయి.

స‌త్యేంద్ర ఉంటున్న సెల్‌లో ఓ వ్య‌క్తి అత‌నికి కాళ్లు వత్తిన దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అంతే కాకుండా త‌ల‌కు మ‌సాజ్ చేయించుకున్న ఫుటేజీ కూడా బ‌య‌ట‌కు రావ‌డంతో.. విమ‌ర్శలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ బయటపెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో, జైలులో ఉన్న వ్యక్తికి ఆప్ రాచమర్యాదలు చేయిస్తోందని బీజేపీ విమర్శలు గుప్తిస్తోంది. తీహార్ జైలులో సత్యేంద్ర జైన్‌ రాజభోగాన్ని అనుభవిస్తున్నారంటూ ఇదివరకే బీజేపీ నాయకులు పలుమార్లు ఆరోపించారు. తాజా వీడియోతో వారి చేతికి ఓ అస్త్రం చిక్కినట్టయింది. కేజ్రీవాల్ ప్రభుత్వమే దగ్గరుండి ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తోందంటూ మండిపడుతున్నారు. హవాలా రాకెట్, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స‌త్యేంద్ర ను మే 30వ తేదీన అరెస్టు చేసింది.