ములాయం సింగ్ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి..

యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్‌ యాదవ్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయంసింగ్‌ యాదవ్‌.. హరియాణా గురుగ్రామ్​లోని మేదాంత హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న హాస్పటల్ లో చేరిన ఆయన.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం కన్నుమూశారు.

ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లో హియా, ప్రముఖ స్వతంత్ర సమర యోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయా ల్లోకి వచ్చారని సీఎం అన్నారు.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఎటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్‌ 22న మూర్తిదేవి-సుఘర్‌సింగ్‌ యాదవ్‌ దంపతులకు ములాయంసింగ్‌ యాదవ్‌ జన్మించారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం.. ఉత్తరప్రదేశ్‌లో దానిని తిరుగులేని శక్తిగా మార్చారు. మూడుసార్లు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు. శాసనసభ్యడిగా 10 సార్లు, లోక్​సభ సభ్యుడిగా ఏడుసార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. ఇంతకు ముందు అజమ్‌గఢ్, సంభాల్ నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలిచారు.