గద్వాల్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో షాకింగ్ ఘటన

గద్వాల్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల పగిలి ఆసుపత్రికి వస్తే.. ఫెవిక్విక్ తో అతికించేసి పంపించారు. ప్రస్తుతం ఈ ఘటన వార్తల్లో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక రాయచూరు జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు.. బంధువుల ఇంట్లో పెళ్లి నిమిత్తం అయిజకు వచ్చారు. ఈ క్రమంలో కుమారుడు ప్రవీణ్‌ చౌదరి (7) గురువారం రాత్రి పెళ్లి వేడుకలో ఆడుకుంటూ కిందపడ్డాడు. ఎడమ కంటి పైభాగంలో గాయం కావడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే, లోతుగా గాయం అయినప్పటికీ.. వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా అక్కడున్న ఫెవిక్విక్‌తో అతికించేసి పంపించారు. గమనించిన తండ్రి వంశీకృష్ణ ఆసుపత్రి వైద్యుడు నాగార్జునను ప్రశ్నించగా.. సిబ్బంది పొరపాటుగా చేశారని పేర్కొన్నారని వంశీకృష్ణ తెలిపారు. అయితే, సిబ్బంది పొరపాటు చేసి ఉండొచ్చని ఓ డాక్టర్ వంశీకృష్ణకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. బాలుడికి ఏమీ కాదని హామీ ఇచ్చారు. అయితే, వంశీ కృష్ణ మాత్రం అయిజ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఇక బాలుడికి ఫెవీక్విక్‌తో చికిత్స చేయడమేమిటని స్థానికులు కూడా ఆసుపత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.