హైదరాబాద్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం : మంత్రి కెటిఆర్

కెసిఆర్ ను మూడోసారి గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపు

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్ బేగంపేట‌లోని ధ‌నియాల‌గుట్ట‌లో అధునాత‌న సౌక‌ర్యాల‌తో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంతోమంది ఈ నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేసినా ప్రభుత్వం వెనుకడుగు వేయలేదన్నారు. జూబ్లీహిల్స్‌లోని మ‌హా ప్ర‌స్థానంకన్నా అద్భుతంగా ఈ వైకుంఠధామాన్ని నిర్మించామని చెప్పారు. ఏ నగరమైనా సరే విశ్వనగరంగా ఎదగాలంటే ఫ్లై ఓవర్లు, మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాల్సిందేనని కెటిఆర్ చెప్పారు. మంచినీటి సరఫరా, 24 గంటల కరెంట్ తప్పనిసరి అని అన్నారు. తొమ్మిదేళ్ల తమ పాలనలో హైదరాబాద్ మనమంతా గర్వపడేలా తయారైందా లేదా అనేది ఆలోచించాలని కోరారు.

హైదరాబాద్ సిటీ న్యూయార్క్ ను తలపించేలా మారిపోయిందన్న హీరో రజనీకాంత్, హీరోయిన్ లయ చేసిన వ్యాఖ్యలను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమెరికా నగరాలలో సమస్యలు ఉండవని అనుకోవడం భ్రమ అని కెటిఆర్ చెప్పారు. అక్కడ ఉండే సమస్యలు అక్కడా ఉంటాయని వివరించారు. మ‌నిషి ఉన్నంత కాలం స‌మ‌స్య‌లు కూడా ఉంటాయని చెప్పారు. అదే విధంగా హైదరాబాద్ లోనూ సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలని చెప్పారు. క‌నీస మౌలిక వ‌స‌తులు, క‌రెంట్, నీళ్ల‌తో పాటు ఇత‌ర అవ‌స‌రాలు క‌ల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయకుడు కెసిఆర్ వ‌ల్లే నగరం, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని చెప్పారు. మంచి నాయ‌కుల‌ను, ప్ర‌భుత్వాల‌ను కాపాడుకోవాలని, కెసిఆర్‌ను మూడోసారి గెలిపించుకోవాలని మంత్రి కెటిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.