పిల్లల కోసం సమయం కేటాయిద్దాం

ఇంట్లో సంతోష సాగరమే

పిల్లల కోసం సమయం కేటాయిద్దాం
parents with children

పిల్లలు ఆనంద అర్ణవాలు, కిలకిల నవ్వులతో, గలగల కేరింతలతో చిన్నారులు నడయాడే ఇల్లు నిజంగా సంతోషసాగరమే అవుతుంది.

ఇలా నిత్య సంతోషంతో పెరిగేవారిలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం మెండుగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సానుకూల దృక్పథం పెంపొందుతుంది కూడా.

ఇది చదువులు, ఆటల వంటి వాటిల్లో రాణించటానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

దీన్ని శాస్త్రీయ అధ్యయనాలూ రుజువు చేస్తున్నాయి. నిజానికి పిల్లలు ఆనందంతో పెరిగేలా చూడటం అంత తేలికైన పనేమీ కాదు.

తల్లిదండ్రుల అవ్యాజమైన ప్రేమ, నమ్మకం, గౌరవం, తోడ్పాటు వంటి ఎన్నో అంశాలతో ముడిపిడిన అంశం. మార్గదర్శకులుగా సరైన పద్ధతిలో నడచుకోవడం దగ్గర్నుంచి పిల్లలు ఆనందాన్ని నీరుగార్చకుండా ఉండటం వరకూ అడుగడుగునా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇందుకు మానసికస్థైర్యం, ఓపికచాలా అవసరం. పెద్దవాళ్ల మాట చద్దన్నం మూట అంటారు. పాత చింతకాయ పచ్చడి అనికొందరు దీన్ని కొట్టేయొచ్చు గానీ శాస్త్రీయంగా రుజువైనప్పుడు ఔరా అనక తప్పదు.

కుటుంబ సభ్యులంతా కలిసి భోజనంచేయాలనే పెద్దల మాట ఇలాంటిదే. ఇది పిల్లల ఆనందానికి దోహదంచేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించటం గమనార్హం.

తరచూ ఇంటిల్లిపాదితో కలిసి భోజనం చేసే పిల్లల్లో బావోద్వేగాలు నియంత్రణలో ఉంటున్నట్టు మద్యం, మాదక ద్రవ్యాల వంటి వ్యవసనాల జోలికి వెళ్లడం తగ్గుతున్నట్టు బయటపడింది.

కుంగుబాటు లక్షణాలూ తక్కువగా కనబడటం విశేషం.

యుక్తవయసు ఆడపిల్లల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. పిల్లలు ఆనందంగా ఉండాలంటే ముందు మనం ఆనందంగా ఉండటం ముఖ్యం.

పిల్లలు అమాయకంగా కనిపించినా మనభావోద్వేగాలను నిశితంగా గమనిస్తుంటారు. పెద్దవాళ్లు ఏమాత్రం నిరాశా నిస్పృహల్లో ఉన్నట్టు కనిపించినా చిన్నారులమనసూ చిన్నబోతుంది.

కుంగుబాటుతో సతమతమయ్యే తల్లుల పెంపకంలో పెరిగిన పిల్లల్లో దురుసుతనం వంటి ప్రవర్తన సమస్యలు తతెత్తే అవకాశం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

కాబట్టి స్వార్థ చింతనతోనైనా ముందు మనం ఆనందంగా ఉండటం మంచిది.

వారాంతాల్లో గానీ వీలైనప్పుడల్లా కుటుంబసభ్యులు, మిత్రులతో సినిమాలకు, షికార్లకు, యాత్రలకు వెళ్లడం వంటివి ఇందులో ఎంతగానో ఉపయోగపడతాయి.

జీవితంలో బంధాలు, అనుబంధాలకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు.

కానీ మనలో ఎంతమంది వీటి గురించి పిల్లలకు వివరిస్తున్నాం? బంధాలను పెంచుకోవడమెలా అన్నది నేర్పిస్తున్నాం? ఇదేమంత కష్టమైన పని కూడా కాదు.

మనసు పెట్టి ఆలోచిస్తే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి వీలైనప్పుడు దూరపు బంధువుల ఇంటికి తీసుకెళ్లొచ్చు.

చిన్నప్పుడు తామెలా కలిసి ఉన్నామో, కష్టాలు ఎదురైనప్పుడు ఎవరినెలా ఆదుకున్నామో చెప్పొచ్చు. కష్టాల్లో ఉన్నవారికి ఉడతాభక్తి సాయం చేయమని చెప్పొచ్చు.

ఏదైనా స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటే వెంట తీసుకెళ్లొచ్చు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/kids/