దంపతుల మధ్య గొడవ..పసికందు ప్రాణం తీసింది

భార్యాభర్తల మధ్య గొడవ మూడు నెలల పసికందు ప్రాణం తీసింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో జరిగింది. శ్రీకాళహస్తి వాటర్ హౌస్ కాలనీకి చెందిన మునిరాజా, స్వాతి దంపతులకు మూడు నెలల బాబు నితిన్ ఉన్నాడు. బాబు అనారోగ్యంతో ఏడుస్తుండటంతో.. ఆసుపత్రికి తీసుకెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అయితే, బాబును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు భర్త బైక్ అందుబాటులో లేకపోవడంతో.. మునిరాజా.. తండ్రి బైక్ తీసుకువచ్చాడు.

మామ బైక్ పై వెళ్లేందుకు కోడలు స్వాతీ అంగీకరించలేదు.. గత కొంతకాలం నుంచి మనస్పర్ధలతో మామ, కోడలు.. మాట్లాడుకోవడం లేదు. ఆ బైక్ పై బాబును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్వాతి ఇష్టపడకపోవడంతో.. క్షణికావేశంలో మూడు నెలల బాబును తండ్రి మునిరాజా బండకేసి కొట్టాడు. దీంతో ఆసుపత్రికి తరలించే లోపు బాబు మృతి చెందాడు. ఈ విషయం తెలిసి పోలీసులు మునిరాజా ఇంటికి చేరుకొని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య తగాదానే బాబు ప్రాణాలను బలి తీసుకుందని పోలీసులు తెలిపారు.