అందుకే ప్రధాని అభ్యర్థిని ఇండియా కూటమి ప్రకటించడం లేదుః ఖర్గే

కూటమి చీలిపోతుందనే ఆందోళనే కారణమన్న కాంగ్రెస్ చీఫ్

projecting-pm-candidate-may-break-india-bloc-unity-says-mallikarjun-kharge

న్యూఢిల్లీః బిజెపిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన కూటమి సభ్యులు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడంపై చర్చలు జరిపారు. అయితే, కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై ఏ పార్టీ కూడా మాట్లాడడంలేదు. దీనిపై తాజాగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తే కూటమిలో చీలికలు వచ్చే ప్రమాదం ఉందని, అందుకే ఎవరినీ ప్రధాని అభ్యర్థిగా చూపడంలేదని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిందని, కూటమిలోని అన్ని పార్టీల ఉమ్మడి లక్ష్యం అదేనని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమిలోని పార్టీల ప్రతినిధులు అంతా సమావేశమై ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఖర్గే చెప్పారు. కాగా, కొన్నిరోజులుగా ఇండియా కూటమిలో కదలిక కనిపించకపోవడానికి కారణం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలేనని ఖర్గే చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని వివరించారు. ఇదే విషయాన్ని కూటమి సభ్యులకు స్వయంగా వివరించి కొన్ని రోజుల పాటు భేటీని వాయిదా వేశామని తెలిపారు.