బిజెపి ఎలా ఆడిస్తే సుఖేశ్ అలా ఆడుతున్నారుః : అరవింద్ కేజ్రీవాల్
ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా చేసి గుజరాత్ ఎన్నికల ప్రచారానికి పంపాలి

హైదరాబాద్‌ః ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌ను తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజెపికి సూచించారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో నిర్వహించిన ‘పంచాయత్ ఆజ్‌తక్’ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన సంచలన లేఖలపై అడిగిన ప్రశ్నకు ఆయనిలా బదులిచ్చారు. సుఖేశ్ బిజెపి ఆదేశాలతో పనిచేస్తుంటారని అన్నారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో బిజెపి 15 ఏళ్లుగా అధికారంలో ఉందని, గుజరాత్‌ను 27 ఏళ్లుగా పాలిస్తోందని, ఇన్ని సంవత్సరాల్లో ప్రజలకు వారు చేసిందేంటో వెళ్లి అడగాలని కేజ్రీవాల్ సూచించారు. దీనికి బిజెపి వద్ద ఎలాంటి సమాధానమూ ఉండదని, అందుకనే సుఖేశ్ రాసిన ప్రేమ లేఖలతో వచ్చేస్తుంటారని దుయ్యబట్టారు.
బిజెపి ఎలా ఆడిస్తే సుఖేశ్ అలా ఆడుతున్నారన్న కేజ్రీవాల్.. సుఖేశ్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా చేసి గుజరాత్ ఎన్నికల ప్రచారానికి పంపాలని బిజెపికి సూచించారు. బిజెపి పాటలకు సుఖేశ్ ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూస్తున్నామని, బిజెపి ఆయనను తమ జాతీయ అధ్యక్షుడిగా చేసుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. దేశంలోని నేరస్థులు, దుండగులు అందరూ రక్షణ కోసం ఒకే పార్టీ పంచన చేరుతున్నారని బిజెపిని ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు సుఖేశ్ కూడా అదే చేస్తున్నారని, బిజెపి నుంచి రక్షణ పొందేందుకు ఆ పార్టీ తరపున డ్యాన్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/