బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడి మృతి

బోరు వేసిన అరగంటకే అందులో పడిపోయిన సాయివర్ధన్

3-year-old Boy-fell-in-Borewell-was-dead

పాపన్నపేట: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో నిన్న సాయంత్రం బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు సాయివర్ధన్ కథ విషాదాంతమైంది. 17 అడుగుల లోతులో చిక్కుకుపోయిన బాలుడిని సురక్షితంగా వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 12 గంటలపాటు శ్రమించినా ఫలితం లేకుండాపోయింది. ఈరోజు ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందాడు.

అనంతరం సాయివర్ధన్ మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదం నెలకొంది. పంటపొలంలో బోరుబావి వేసిన అరగంటకే సాయివర్ధన్ అందులో పడిపోయాడు. పొలం వద్ద ఎవరి పనుల్లో వారుండగా ఆడుకుంటూ వెళ్లిన సాయివర్ధన్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి, ఆర్డీవో సాయిరాం ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాలుడిని రక్షించేందుకు 12 గంటలపాటు శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/