మాతో 25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారుః బండి సంజయ్

30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కెసిఆర్ డబ్బులు పంపిస్తున్నారని ఆరోపణ

bandi-sanjay

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన చెప్పారు. బిజెపి కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారని కెటిఆర్ అంటున్నారని… బిఆర్ఎస్ మాదిరి తాము రాజకీయ వ్యభిచారం చేయమని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వారిని బిజెపిలోకి చేర్చుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని పెంచేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని… 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రతి నెలా డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు.

హిందువుల గురించి తాను మాట్లాడుతూనే ఉంటానని… తన వల్లే బిఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా భాగ్యలక్ష్మి ఆలయం బాట పట్టాయని సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని… కెసిఆర్ కుటుంబ సభ్యులు సహా అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తామని చెప్పారు. అవినీతిపరులను మోడీ ప్రభుత్వం వదలిపెట్టదని అన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారు.