ఆపరేషన్‌ కావేరీ..జెడ్డా నుంచి 231 మంది భారతీయ పౌరులతో బయల్దేరిన విమానం

231 Indians Leave Jeddah Onboard IAF Aircraft As Operation Kaveri Continues

జెడ్డాః సూడాన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్‌ కావేరీలో భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీ అరెబియాలోని జెడ్డా నుంచి ముంబయి బయల్దేరింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఈ విమానంలో 231 మంది స్వదేశానికి తిరిగివస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్‌ బగ్చీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మంగళవారం రాత్రి 328 మంది సూడాన్‌ నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు 3 వేల మందిని క్షేమంగా తరలించామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. సూడాన్‌లో అధికారం కోసం సైన్యంలోని రెండు గ్రూపులు ఏప్రిల్‌ 15 నుంచి పోరాడుతున్నాయి. దీంతో దేశంలో అశాంతి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 24న ఆపరేషన్‌ కావేరీని ప్రారంభించింది. ఇప్పటివరకు 11 విమానాల్లో సూడాన్‌ను భారతపౌరులను స్వదేశానికి తీసుకొచ్చారు.

కాగా, ఏప్రిల్ 15న సూడాన్ సాధారణ మిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్అ ని పిలిచే పారామిలిటరీ బలగాల మధ్య ప్రారంభమైన ఆధిపత్య పోరాటం వల్ల ఇప్పటివరకు 3 లక్షల 30 వేల మందికి పైగా ప్రజలు వారివారి స్వదేశాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మరో లక్ష మందికిపైగా సరిహద్దులు దాటి పారిపోయారని తెలిపింది. మొత్తంగా దేశం నుంచి 4 లక్షల 30 వేల మందికిపైగా దేశం నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నది.