ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌ ను మాకివ్వండి – ఏపీని కోరిన తెలంగాణ

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌ను మాకివ్వండి అని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చోటు చేసుకుని తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్నా..ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు. తాజాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ అంశంపై జరిగిన సమావేశంలోనూ మరోసారి ఇదే పరిస్థితి ఎదురైంది.

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌తో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని, కాబట్టి దానిని తమకు వదిలేయాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. దానిని తమకు ఇచ్చేస్తే పటౌడీ హౌస్‌లో తమకున్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని సూచించారు.

తెలంగాణ అధికారుల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ఏపీ అధికారులు ఈ విషయంపై తమ సీఎం జగన్ తో చర్చించాక నిర్ణయం చెబుతామని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చేవారం మరోమారు సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు నిర్ణయించారు.