పాలకొల్లులో జనసేన కు భారీ షాక్ : వైసీపీ లోకి కీలక నేత

జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కీలక నేత గుణ్ణం నాగబాబు జనసేన పార్టీ కి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం సీఎం జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో గుణ్ణం నాగబాబు వైఎస్సార్‌సీపీలో చేరారు. నాగబాబుతో పాటు ఆయన కుమారుడు గుణ్ణం సుభాష్, పాలకొల్లుకు చెందిన జనసేన నాయకులు వీర శ్రీనివాసరావు, విప్పర్తి ప్రభాకరరావుకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
నాగబాబు వైసీపీలో చేరతారని గత కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. గతంలో వైసీపీ తరఫున పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న నాగబాబు.. అసెంబ్లీ సీటు రాకపోవడంతో 2019లో జనసేనలో చేరారు.
జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఆ ఎన్నికల్లో 32,984 ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు. అలాంటి కీలక నేత పార్టీ మారి తిరిగి వైసీపీలోకి చేరారు. నాగబాబు భార్యకు మున్సిపల్ చైర్మన్ టికెట్, ఆయనకు పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఆఫర్ చేసినట్లు అందుకే ఆయన వైసీపీ లో చేరినట్లు ప్రచారం సాగుతుంది.